
దొంగతనాల కోసం అంతర్రాష్ట్ర ముఠా ఎత్తుగడ
పెద్దపల్లిలో నిందితుడి అరెస్ట్ – కారు, బంగారు గొలుసు స్వాధీనం…..
పెద్దపల్లి : పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి కారు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, రూరల్ ఎస్సై మల్లేశం తెలిపారు.
ఉదయం ఎస్సై మల్లేశం సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కూనారం రైల్వే గేట్ ప్రాంతంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టగా గతంలో చేసిన నేరాలను ఒప్పుకున్నాడు.
అరెస్ట్ చేసిన నిందితుడు ఊరడి జనార్ధన్ (31), నల్గొండ జిల్లా పెద్ద అడిశర్ల మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి చెందినవాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబ ఖర్చులకు డబ్బులు సరిపోక తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించి దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు.
తన స్నేహితులు తమ్మిశెట్టి వెంకటేష్, తమ్మిశెట్టి మణికంఠలతో కలిసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయంలో చోరీలకు పాల్పడేవారని విచారణలో వెల్లడైంది. 2025 సెప్టెంబర్‌లో నల్గొండ నుంచి కారు అద్దెకు తీసుకుని వరంగల్, కరీంనగర్ మీదుగా పెద్దపల్లికి చేరుకుని సుల్తానాబాద్ సమీపంలో ఒక స్కూటీని దొంగిలించి నిమ్మనపల్లి గ్రామానికి వెళ్లి ఒక ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపారు.
అనంతరం గుంటూరు మీదుగా గోవాకు పారిపోయి దొంగిలించిన బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగతనంలో తన వాటాగా వచ్చిన రెండు తులాల బంగారు గొలుసును తన వద్దే ఉంచుకున్నట్లు విచారణలో బయటపడింది.
మరోసారి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అదే కారులో పెద్దపల్లికి వచ్చిన సమయంలో కూనారం రైల్వే గేట్ సమీపంలో పోలీసులు అనుమానంతో పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి రెడ్ కలర్ బలెనో కారు (టి ఎస్ 07ఎఫ్ ఎల్ 1111), 20 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన పెద్దపల్లి సీఐ కె. ప్రవీణ్ కుమార్, రూరల్ ఎస్సై బి. మల్లేశ్, ఏఎస్ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, పీసీలు ప్రభాకర్, పొగుల రమేష్, అనిల్‌లను రామగుండం పోలీస్ కమిషనర్, పెద్దపల్లి డీసీపీ, ఏసీపీలు అభినందించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
