
ప్రజల భద్రతే ధ్యేయంగా, సీఐ ఇంద్రసేన రెడ్డి….
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామని గోదావరిఖని 1 టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి తెలిపారు. వినోబానగర్, రెల్లివాడ, లెనిన్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ తనిఖీలు నిర్వహించి వాహనదారులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 40 ద్విచక్ర వాహనాలపై జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా సీఐ ఇంద్రసేన రెడ్డి యువతతో మాట్లాడి గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వలన వ్యక్తిగత జీవితం, కుటుంబాలు, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్య, ఉపాధి, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు.
అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్లు ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మహిళలు, బాలికలపై సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి కాలనీలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుందని తెలిపారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
