
డంపింగ్ యార్డ్ పవర్ ప్లాంట్ తరలించకపోతే ఆమరణ దీక్ష మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ హెచ్చరిక
దుండిగల్ తండా-2లో డంపింగ్ యార్డ్, పవర్ ప్లాంట్‌పై ప్రజల ఆగ్రహం
ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న తండా ప్రజలు.. మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్
దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ తండా-2లో ఉన్న డంపింగ్ యార్డ్ మరియు పవర్ ప్లాంట్ కారణంగా స్థానిక ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని దుండిగల్ మాజీ కౌన్సిలర్ శంకర్ నాయక్ ఆరోపించారు. ఈ మేరకు దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
గత రెండు సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్‌లో చెత్తను బహిరంగంగా వేయడం, అనంతరం మంటలు పెట్టడంతో తండా మొత్తం పొగతో కమ్ముకుపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ సమస్యలు, మహిళల్లో గర్భసంచి సంబంధిత అనారోగ్యాలు పెరిగిపోయాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి బాధితులకు కార్పొరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గతంలో అప్పటి కమిషనర్ తండాలను మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తామని, డంపింగ్ యార్డ్ చుట్టూ ప్రహరీ నిర్మించి తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుల తయారీ చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుతం చెత్తను రోడ్లపై వేస్తూ తగులబెట్టడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు.
డంపింగ్ యార్డ్, పవర్ ప్లాంట్‌ను వెంటనే అక్కడి నుంచి తరలించాలని, తండాలోని రోడ్లను శుభ్రం చేసి చెత్తను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మూడు తండాల ప్రజలు కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
