
మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే చర్యలు…
డీజేలు, అనుమతి లేని డ్రోన్లకు నో.. జూలై 1 వరకు నిషేధాజ్ఞలు….
రామగుండం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు….
–సీపీ అంబర్ కిషోర్ ఝా….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళలు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాన్ని కూడా జూలై 1 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా శబ్ద కాలుష్య నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమాల కోసం మైక్ సెట్ వినియోగించాలనుకుంటే సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
అనుమతి లేకుండా డ్రోన్లను ఎగరవేయడం కూడా నిషేధితమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక జూన్ 1 నుంచి జూలై 1 వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కాలంలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. బంద్‌ల పేరిట ప్రజలను, వ్యాపార సంస్థలను బలవంతపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
