
రిక్షా కాలనీని సమస్యల రహిత కాలనీగా తీర్చిదిద్దుతాం….
చైతన్యపురి కాలనీలో మేయర్ మహంకాళి స్వామి పర్యటన – మురుగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి రిక్షా కాలనీని సమస్యల రహితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 22వ. డివిజన్ చైతన్యపురి కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్న ఈ కాలనీ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని పేర్కొన్నారు. కొన్ని ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు కూడా లేకపోవడం విచారకరమన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో అందరికీ పట్టాలు మంజూరు చేయించి, ఇంటి నంబర్లు కేటాయించి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి కరెంట్ కనెక్షన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కాలనీలో సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో గత వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
కాలనీ నుండి మురుగు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో మేయర్ స్వయంగా దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన కచ్చా నాలా తవ్వించే పనులు చేపట్టించారు. కాలువలో పూడిక తొలగించి నిలిచిపోయిన మురుగు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
అదేవిధంగా నాలుగు జేసీబీ యంత్రాలు, బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో కాలనీలో దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లు, గుబుర్లు, పొదలను తొలగించారు. రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించి, అదనపు సిబ్బందితో కాలనీ అంతా శుభ్రపరిచారు. ప్రజలు చెత్తను బయట పడవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని మేయర్ కోరారు.
స్థానిక కార్పొరేటర్ కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్ కాలనీలోని సమస్యలను మేయర్‌కు వివరించి ప్రత్యక్షంగా చూపించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వడ్లూరి రవి, చిదురాల నాగరాజు, నాయకులు కందుల సతీష్, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఏఈ మీర్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, శానిటరీ జవాన్ ఆడెపు శ్రీనివాస్, మెప్మా సీఓ శ్వేత, వర్క్ ఇన్‌స్పెక్టర్ లింగయ్య, ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
