మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణలో సమాజం భాగస్వామ్యం కావాలి…

Spread the love

మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణలో సమాజం భాగస్వామ్యం కావాలి…

– డీసీపీ బి. రామ్ రెడ్డి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టిపీసి, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీపీసీ కాకతీయ హాల్‌లో ఎన్‌టీపీసీ పోలీస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్, గోదావరిఖని ఏసీపీ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో మహిళల భద్రత, మైనర్ బాలికల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, డీ-అడిక్షన్ సెంటర్ల సేవలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావంతో తక్కువ సమయంలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, బలహీన భవనాలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, కాలనీ నాయకులు తమ ప్రాంతాల్లో ప్రమాదకర భవనాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

అలాగే పిల్లల్లో సెల్‌ఫోన్ వినియోగం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, సైబర్ నేరాలు ఆందోళనకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలపై పర్యవేక్షణ పెంచడంతో పాటు వారి మొబైల్ ఫోన్ వినియోగాన్ని గమనించాలని సూచించారు.

డీసీపీ బి. రామ్ రెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మైనర్ బాలికలు మోసపూరిత సంబంధాల బారిన పడి ఇళ్ల నుంచి వెళ్లిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బాలికలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తేనే మహిళలపై జరిగే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. సమాజంలో సురక్షిత వాతావరణం కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, ఆఫ్జాలుద్దీన్, ఎస్‌ఐ ఎన్‌టీపీసీ ఉదయ్ కిరణ్, లచ్చన్న, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top