ప్రాణాల కంటే వేగం ముఖ్యం కాదు… హెల్మెట్,సీట్‌బెల్ట్ ధరిద్దాం… సురక్షితంగా ఇంటికి చేరుకుందాం…
యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యత: పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి.ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలి.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని హనుమంతునిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్-అరైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు,రోడ్డు సేఫ్టీ,హెల్మెట్ వినియోగం,సీట్‌బెల్ట్ ధరించడం,నిర్లక్ష్యపు డ్రైవింగ్,మైనర్ డ్రైవింగ్,గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ,పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం,గురువుల పట్ల భక్తి కలిగిన విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రస్తుతం మాదకద్రవ్యాల వ్యసనం యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని,డ్రగ్స్‌కు అలవాటు పడిన పిల్లల్లో ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని తెలిపారు.ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం, తల్లిదండ్రులను బెదిరించడం, అవసరం లేని డిమాండ్లు చేయడం, మానసిక ఒత్తిడికి గురిచేయడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు.
అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని, పోలీసులు అవసరమైన కౌన్సెలింగ్ అందించడమే కాకుండా వైద్య నిపుణులు, మనోవైద్యుల సహాయంతో పిల్లలను సరైన మార్గంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు.డ్రగ్స్ బారిన పడిన యువతలో కనిపించే లక్షణాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నిపుణులు ఇప్పటికే అవగాహన కల్పించారని పేర్కొంటూ,అలాంటి సంకేతాలు గమనించిన వెంటనే తల్లిదండ్రులు స్పందించాలని కోరారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి,ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విస్తృత చర్యలు చేపడుతోందని తెలిపారు.యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ప్రభుత్వంతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని డీసీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శ్వేత,ఆరోగ్య శాఖ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు, విద్యాశాఖ ప్రధానోపాధ్యాయులు, నీటిపారుదల శాఖ అధికారులు,విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
