
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి…
–అంతర్గాం ఎస్‌ఐ బోయ వెంకటస్వామి….
పెద్దపల్లి, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో స్థానిక యువత, వారి తల్లిదండ్రులకు మాదకద్రవ్యాల నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బోయ వెంకటస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడితే విలువైన జీవితం నాశనం అవుతుందని హెచ్చరించారు. చెడు స్నేహాల ప్రభావంతో ఆరోగ్యం దెబ్బతిని భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మత్తుకు బానిసైన కొందరు యువకులు ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోవడం, అమ్మాయిలను వేధించడం, డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడడం, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి చర్యలకు దిగుతున్నారని చెప్పారు.
అలాగే మత్తులో వాహనాలు వేగంగా నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను అమ్మినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని ఆయన సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప-శ్రీనివాస్, కార్యదర్శి ఎస్. కమల, పోలీస్ సిబ్బంది ఎం. సంతోష్, నాగరాజ్, స్థానిక యువత, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
