
“ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి….
ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దిశానిర్దేశం…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనల మేరకు సమర్థవంతంగా పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధికారులను, బీఎల్‌వోలకు సూచించారు.
ఎన్‌టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్‌లో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా, అనర్హుల పేర్లు నిబంధనల ప్రకారం తొలగించేలా అధికారులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలని తెలిపారు. ప్రజలకు ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించి, వారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఇన్‌చార్జ్ కమిషనర్ అరుణ శ్రీ, సంబంధిత అధికారులు, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
