బహిరంగ మద్యం సేవనం, డీజేలు, అనుమతి లేని డ్రోన్లపై పోలీసుల కఠిన నిఘా….

Spread the love

బహిరంగ మద్యం సేవనం, డీజేలు, అనుమతి లేని డ్రోన్లపై పోలీసుల కఠిన నిఘా….

ఆగస్టు 1 వరకు నిషేధాజ్ఞలు కొనసాగింపు.. ధర్నాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి…

— పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, విద్యార్థులు, వృద్ధుల ఇబ్బందులను నివారించే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.

మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ల పరిధిలో కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రజలను అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు అమల్లో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 223తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం-1348 ఫసలీ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై విధించిన నిషేధాన్ని కూడా కొనసాగించినట్లు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఏ కార్యక్రమంలోనైనా మైక్ సెట్ వినియోగించాలంటే సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగం కూడా పూర్తిగా నిషేధించబడిందని, డ్రోన్లు ఉపయోగించాలనుకునే వారు సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందాలని కమిషనర్ స్పష్టం చేశారు. డీజేలు, డ్రోన్లపై నిషేధాజ్ఞలు కూడా ఆగస్టు 1 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

అదేవిధంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ చట్టం అమలులో భాగంగా జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. బంద్‌ల పేరుతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top