
రైతులకు అన్యాయం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదు….
పెద్దకల్వల భూ నిర్వాసిత రైతులకు సంఘీభావం – ఏకపక్ష భూసర్వేలు నిలిపివేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
–నల్ల మనోహర్ రెడ్డి..
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామం వద్ద ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణం నేపథ్యంలో భూ నిర్వాసిత రైతులకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి హెచ్చరించారు.
పెద్దకల్వల గ్రామంలో ఆందోళన చేస్తున్న భూ నిర్వాసిత రైతులను కలిసి వారికి సంఘీభావం ప్రకటించిన ఆయన మాట్లాడుతూ, రైతులను సంప్రదించకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవసాయ భూముల్లో మార్కింగ్‌లు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
గతంలో గ్రామ ప్రజాప్రతినిధికి చెందిన స్థలానికి సమీపంగా బైపాస్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా ప్రణాళికను మార్చి చిన్న, సన్నకారు రైతుల సారవంతమైన వ్యవసాయ భూముల మీదుగా రహదారిని మళ్లించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.
రైతులకు సమాచారం ఇవ్వకుండా హడావుడిగా ఎర్రజెండాలు పాతడం వెనుక అధికార పార్టీ నేతల స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయని విమర్శించారు. రైతుల పొట్ట కొట్టి వారి భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమని, ఒక రైతుకు మూడు ఎకరాల వరకు భూమి కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సర్వే వల్ల దాదాపు 15 ఎకరాల సారవంతమైన భూమి నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
కొందరు బడా వ్యక్తుల అక్రమ నిర్మాణాలను కాపాడేందుకు పేద రైతుల భూములను బలి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించకుండా, రైతుల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న సర్వేలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు బీజేపీ పూర్తి మద్దతుగా ఉంటుందని, బలవంతపు భూసేకరణకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నల్ల మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
