
ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారమే లక్ష్యం – రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:రామగుండం, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, చట్టపరిధిలో సత్వర పరిష్కారం అందించడానికే పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తోందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను శ్రద్ధగా విన్న కమిషనర్, సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకుని, చట్టపరిధిలో సత్వర చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, బాధితులకు న్యాయం చేయడమే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రజలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా సివిల్ స్వభావం కలిగి ఉంటాయని, అలాంటి వివాదాలకు సంబంధిత న్యాయస్థానాలను ఆశ్రయించడం శాశ్వతమైన, చట్టబద్ధమైన పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు, గొడవలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
వివాదాలు లేదా ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
