
పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి….
–మహనీయుల ఆశయ సాధన సంఘం….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి
పెద్దపల్లి పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంకూరి కైలాసం డిమాండ్ చేశారు.
విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన, సంఘం నాయకుడు కాశిపాక వాసుతో కలిసి మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారులపై లారీలు, టిప్పర్లు తదితర భారీ వాహనాలు విచ్చలవిడిగా సంచరించడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల అయ్యప్ప ఆలయం సమీపంలో టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటనతో పాటు, కమాన్ కూడలి వద్ద టిప్పర్ ఢీకొనడంతో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న దళిత మహిళ మృతి చెందిన సంఘటనలు తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మంథని ఫ్లైఓవర్ నుంచి చీకురాయి రోడ్ వరకు అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ పోలీసులు భారీ వాహనాల రాకపోకలను కట్టుదిట్టంగా నియంత్రించాలని కోరారు.
అలాగే పెద్దపల్లి బైపాస్ రహదారి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తే భారీ వాహనాలను పట్టణం వెలుపల మళ్లించే అవకాశం ఉండి, ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని బొంకూరి కైలాసం అభిప్రాయపడ్డారు. ప్రజల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మహనీయుల ఆశయ సాధన సంఘం సభ్యులు, ఉద్యమకారుడు కొంకటి లింగమూర్తి పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
