
11 లక్షల మొక్కలను కాపాడండి… నర్సరీ మహిళా కార్మికులకు ఉపాధి కల్పించండి…
ఆరు రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షకు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల మద్దతు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, సింగరేణి ఆర్జీ-1 నర్సరీలో మహిళా కార్మికులు కష్టపడి పెంచిన 11 లక్షల చెట్ల మొక్కలను సంరక్షించడంతో పాటు వారికి తక్షణమే ఉపాధి కల్పించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు శనిగల శ్రీనివాస్, మద్దెల శ్రీనివాస్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
నర్సరీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నర్సరీ గేటు ఎదుట చేపట్టిన నిరసన దీక్ష తో ఆరవ రోజుకు చేరుకుంది.
ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, విత్తనం నాటినప్పటి నుంచి మొక్కలుగా ఎదిగే వరకు మహిళా కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించి పెంచిన 11 లక్షల మొక్కలను కాపాడాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందన్నారు. ఈ సమస్యకు సింగరేణి ఫారెస్ట్ విభాగం జనరల్ మేనేజర్, డైరెక్టర్లు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల ఉపాధికి భంగం కలిగించే ప్రస్తుత టెండర్లను వెంటనే రద్దు చేసి, నర్సరీ నిర్వహణ బాధ్యతలను సివిల్ యాజమాన్యానికి అప్పగించాలని కోరారు. గత ఆరు రోజులుగా మహిళా కార్మికులు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.
ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మహిళా కార్మికులకు ఉపాధి భద్రత కల్పించి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్జీ-1 ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
