జూలై నెలాఖరులోగా కూనారం ఆర్‌ఓబీ పూర్తి చేయాలి..

Spread the love

జూలై నెలాఖరులోగా కూనారం ఆర్‌ఓబీ పూర్తి చేయాలి….

ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను 18లోపు ముగించాలి…
–కలెక్టర్ కోయ శ్రీహర్ష..

పెద్దపల్లి// పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లైఓవర్ (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకుండా వేగవంతంగా పూర్తి చేసి జూలై నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారాలు నింపించి ఈ నెల 18వ తేదీలోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని సూచించారు.

కూనారం రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కూనారం ఆర్‌ఓబీ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని అన్నారు.

విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పనుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. పనుల అమలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా క్షేత్రస్థాయిలోనే వెంటనే పరిష్కరించి, జూలై నెలాఖరులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను ఈ నెల 18వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి ఓటరిని చైతన్యపరిచి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా నింపించి బీఎల్‌వోలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఫారాలను తిరిగి బీఎల్‌వోలకు సమర్పించకపోతే ఓటరు నమోదుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫారాలను సమర్పించి డిజిటలైజేషన్ పూర్తయ్యేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈ పర్యటనలో ఆర్ అండ్ బి ఈఈ భావ్‌సింగ్, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top