
సింగరేణికి కేంద్ర ప్రభుత్వ రంగ హోదా కల్పించాలి…
కేంద్ర మంత్రికి కార్మిక నాయకుల వినతి – సానుకూల స్పందన….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి, శ్రీరాంపూర్, సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వ రంగ హోదా కల్పించాలని కార్మిక సంఘ నాయకులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి డా. బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో నాయకులు మంగళవారం శ్రీరాంపూర్ అతిథి గృహంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఇటీవల సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గనిని కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కి డా. జనక్ ప్రసాద్‌తో పాటు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సింగరేణికి కేంద్ర ప్రభుత్వ రంగ హోదా కల్పించాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ హోదా లభిస్తే భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు చట్టపరమైన, పర్యావరణ సంబంధిత అనుమతులు త్వరగా లభించే అవకాశం ఉంటుందని వివరించారు. కొత్త గనుల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో పాటు దేశ ఇంధన భద్రత బలోపేతం కావడానికి, తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో సింగరేణి మరింత కీలక పాత్ర పోషించడానికి దోహదపడుతుందని తెలిపారు.
వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణికి కేంద్ర ప్రభుత్వ రంగ హోదా కల్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ధర్మపురి, ఉపాధ్యక్షులు శ్యామ్, దాస్, సదానందం, ప్రధాన కార్యదర్శి వికాస్ కుమార్ యాదవ్, గనుల సిబ్బంది బాధ్యుడు తిరుపతి రాజు, ఉప ప్రధాన కార్యదర్శి గరిగె స్వామి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
