
కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మారుపేర్ల బాధితుల సంఘం వినతిపత్రం…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి. గోదావరిఖని, : సింగరేణిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను పరిష్కరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని సింగరేణి మారుపేర్ల బాధితుల సంఘం అధ్యక్షుడు లక్కా శ్రావణ్ గౌడ్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు.
సింగరేణి భరోసా యాత్రలో భాగంగా ఓసీపీ–5ను సందర్శించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి లక్కా శ్రావణ్ గౌడ్ వేదికపై వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి, ప్రత్యేక కమిటీని త్వరితగతిన ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
ఇటీవల తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించిన ఆయన, అదే చొరవతో మారుపేర్ల బాధితుల సమస్య పరిష్కారానికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కందుల సంధ్యారాణి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం తన ప్రసంగంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందిస్తూ, సింగరేణి మారుపేర్ల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, బాధితులకు వీలైనంత త్వరగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సింగరేణి మారుపేర్ల బాధితుల సంఘం తరఫున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ సమస్యకు త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపి వేలాది బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
