
రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం…
అభివృద్ధి పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలి….
— మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
రామగుండం నగరంలోని అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు.
నగరంలోని 4వ.డివిజన్ గంగానగర్లో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద డీఎంఎఫ్టీఈ నిధుల నుంచి రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ కంకణాల మౌనిక రాజుతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో రోడ్డు లేకపోవడంతో లారీలు బురదలో చిక్కుకుపోతున్నాయని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేయగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు.
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సీసీ రోడ్లలో పగుళ్లు వచ్చే అవకాశం ఉండటంతో పనులను ప్రారంభించలేదని, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే చొరవతో నగరంలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో రోడ్లు, కాలువల నిర్మాణ పనులు ప్రతిపాదించామని, వాటిని రాబోయే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని మేయర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏఈ మీర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
