
ఎన్టీపీసీ ఈఎస్ఐ డిస్పెన్సరీకి వైద్యుల కొరత తీర్చాలి…..
ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కార్మిక జేఏసీ వినతి….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనికి వచ్చిన సందర్భంగా ఎన్టీపీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆయనను కలిసి ఎన్టీపీసీ ఈఎస్ఐ డిస్పెన్సరీలో నెలకొన్న వైద్యుల కొరతపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం కాగజ్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు, సిబ్బందిని ఎన్టీపీసీ ఈఎస్ఐ డిస్పెన్సరీకి బదిలీ చేస్తే ఇక్కడ వైద్య సేవలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీపీసీతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 20 వేల మందికి పైగా ఈఎస్ఐ ఐపీ (ఇన్సూర్డ్ పర్సన్స్) లబ్ధిదారులు ఈ డిస్పెన్సరీపై ఆధారపడుతున్నారని, వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే నియమించి, మందుల లభ్యతను మెరుగుపరచాలని, కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కేంద్ర కార్మిక శాఖ, ఈఎస్ఐ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఎంపీని కోరారు.
వినతిని స్వీకరించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమస్యను సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు కార్మిక నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకుడు దగ్గుల సత్యం, టీయూసీ నాయకుడు టి.ఎన్. భూషణ్, నాయకుడు ఎలితపు వెంకటేశం, పెద్దపల్లి జిల్లా అసంఘటిత కార్మిక విభాగం అధ్యక్షుడు అహ్మద్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
