
సీజనల్ వ్యాధుల నియంత్రణకు డ్రైడే కార్యక్రమం కట్టుదిట్టంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
సీజనల్ వ్యాధుల నివారణకు పరిశుభ్రతే ప్రధాన ఆయుధమని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, డ్రైడే కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
డ్రైడే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త వారానికి కనీసం 30 ఇళ్లను సందర్శించి దోమల నివారణ, పరిశుభ్రత, నీటి నిల్వల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తల పనితీరును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో క్రాస్ వెరిఫికేషన్ చేసి కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోందో లేదో నిర్ధారించాలని సూచించారు.
పెద్దపల్లి, రామగుండం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ రోగుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీలు) వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పీహెచ్‌సీలలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా జిల్లా ఆసుపత్రులపై రోగుల ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల శాతాన్ని 85 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేయాలని, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు.
హెచ్‌పీవీ టీకాల స్వీకరణను పెంచేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎన్‌సీడీ కార్యక్రమం కింద అవసరమైన మందులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పవిత్ర, సంబంధిత వైద్యులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
