
కాంట్రాక్ట్ కార్మికులను ఉద్దేశపూర్వకంగా అనర్హులుగా ప్రకటిస్తున్నారంటూ ఎన్టీపీసీ ఆసుపత్రిపై జేఏసీ ఆగ్రహం….
అదనపు వైద్య పరీక్షల పేరుతో ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపణలు – సిబ్బంది ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తి….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
ఎన్టీపీసీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వైద్య పరీక్షల వ్యవహారంలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులపై వివక్ష చూపుతూ ఉద్దేశపూర్వకంగా తాత్కాలికంగా విధులకు అనర్హులుగా (టెంపరరీ అన్ఫిట్) ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
జేఏసీ నాయకుల కథనం ప్రకారం, రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల పేరుతో అనేక మంది కార్మికులను విధులకు అనర్హులుగా ప్రకటిస్తూ, అదనపు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈసీజీ పరీక్షలను ఇతర ఆసుపత్రుల్లో చేయించుకుని నివేదికలు తీసుకురావాలని చెప్పడం వల్ల ఒక్కో కార్మికుడిపై రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా, కరీంనగర్లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి మాత్రమే వైద్య నివేదికలు తీసుకురావాలని సూచించడం వల్ల కార్మికులు సమయం, డబ్బు రెండింటినీ కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ విధానం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యలను వివరించేందుకు ఆసుపత్రి అధికారులను కలిసినప్పుడు తమతో మర్యాదపూర్వకంగా వ్యవహరించకుండా అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. సమస్యలను వినకుండా బయటకు వెళ్లాలని ఆదేశించడం సరైన విధానం కాదని విమర్శించారు. ఆసుపత్రిలోని కొంతమంది సిబ్బంది కూడా కార్మికులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని వారు పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులు కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి ఇబ్బందులు కలిగించే విధానాలను వెంటనే నిలిపివేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. వైద్య పరీక్షల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అవసరం లేని పరీక్షలతో కార్మికులపై ఆర్థిక భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ అంశాలపై ఎన్టీపీసీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, నాంసాని శంకర్, గేట్ల లక్ష్మారెడ్డి, బుజ్జగిరి భూమయ్య, ఆధారపు రాజమల్లయ్య, దగ్గుల సత్యం, చింతల సత్యం, ఆలేటి శ్రీనివాస్, ఆర్. లక్ష్మణ్, బి. బుచ్చయ్య, రాయమల్లు తదితరులు, పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
