యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి…

Spread the love

యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి…

అవకాశాలు పెంచేందుకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, జిల్లాలోని యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో యువతకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న పోలీసు ఉద్యోగాల భర్తీలో పెద్దపల్లి జిల్లా యువత అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించేలా ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నాణ్యమైన శిక్షణతో పాటు అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కోర్సులను రూపొందించి యువతను ఉద్యోగాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దితే జిల్లాకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

గ్రామీణ యువతకు ప్రభుత్వ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో అర్హులైన యువతను గుర్తించి వారికి శిక్షణ, ఉద్యోగ అవకాశాలపై సమాచారం అందించాలని ఆదేశించారు.

ప్రముఖ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఐటీఐ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. అలాగే నర్సింగ్ విద్యార్థులకు విదేశీ ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి, భాషా శిక్షణతో పాటు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి అకాడమీలు అందిస్తున్న శిక్షణా కోర్సులపై యువతలో విస్తృత ప్రచారం నిర్వహించి, ఎక్కువ మంది అభ్యర్థులు వాటిలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, జిల్లా ప్రణాళిక అధికారి జి. రవీందర్, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, నైపుణ్యాభివృద్ధి విభాగం అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top