
భారీ వర్షాల వేళ ప్రజలకు అండగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన, అధికారులకు కీలక ఆదేశాలు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, . ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ, 9వ, 38వ డివిజన్లలో పర్యటించి వర్షాల ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీరు, డ్రైనేజీ పరిస్థితి, ప్రజల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వెంటనే పంపింగ్ ద్వారా నీటిని తొలగించాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.
ప్రజలు కూడా అనవసరంగా వరద నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఏసీపీ, కార్పొరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
