
మైనర్ బాలికపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రంగా ఖండనీయం…..
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి….
–ఎంపీ గడ్డం వంశీకృష్ణ…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
15 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్య విలువలకు మచ్చ తెచ్చే ఘటన అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమగ్ర వివరణ ఇవ్వడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ మాట్లాడుతూ, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
కేవలం ఒక సామాజిక మాధ్యమ పోస్టు లేదా వీడియో చేసినందుకు 15 ఏళ్ల బాలికను లక్ష్యంగా చేసుకుని అత్యాచార, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక మైనర్ బాలికను క్షమాపణ చెప్పేలా ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
మహిళల భద్రతపై నినాదాలు ఇచ్చే ప్రభుత్వం, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపుల విషయంలో కూడా అదే స్థాయిలో చిత్తశుద్ధి చూపాలని కోరారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజలకు చేసిన వాగ్దానాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధారణ ప్రజలపై నిఘా కోసం కాకుండా, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు వినియోగించాలని సూచించారు.
తెలంగాణలో కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర అంశాలతో దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు, మహిళల భద్రత, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
