జయశంకర్ ఆశయాలే యువతకు మార్గదర్శకం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Spread the love

జయశంకర్ ఆశయాలే యువతకు మార్గదర్శకం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి….

–అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పిలుపునిచ్చారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండి వ్యసనరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నషా ముక్తి భారత్’ పోస్టర్‌ను ఆవిష్కరించి, వ్యసన నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, యువత వాటిని ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొన్న ఆయన, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వ్యసనరహిత భారత నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, సీపీఓ రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top