
DMF నిధులతో జిల్లాలో విద్య, వైద్యం, త్రాగునీటి సౌకర్యాలు – ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఢిల్లీ/ఏలూరు, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ (District Mineral Foundation-DMF) ద్వారా సమకూరిన నిధులను వివిధ ప్రజావసరాల పనుల కోసం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే వెల్లడించారు. ఏలూరు జిల్లా సహా ఆంధ్రప్రదశ్ రాష్ట్రవ్యాప్తంగా DMF కింద సమకూరిన నిధులు, వాటిని వినియోగించిన వివరాలు కోరుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. DMF కింద గత ఐదేళ్లలో ఏలూరు జిల్లాలో 38.37 కోట్ల నిధులు సమకూరగా, వివిధ పనుల నిమిత్తం 20.86 కోట్లకు కేటాయింపులు చేసినట్లు, అయితే జిల్లా యంత్రాంగం కేవలం 7.18 కోట్ల నిధులనే ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 93 మౌలిక సదుపాయాల పనులు, 32 తాగునీటి పథకాల పనులు, 15 విద్యా సంబంధిత, 15 ఆరోగ్య, 27 పారిశుధ్య నిర్వహణ, 10 ఇతర పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఏలూరు జిల్లాలో 93,900 మంది ప్రజలకు లబ్ది కలుగుతుందని కేంద్రమంత్రి వివరించారు.
DMF నిధుల వసూలు, వాటి వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన (PMKKKY) మార్గదర్శకాలు, 2024ను జారీ చేసిందని చెప్పిన కేంద్ర మంత్రి, ఈ నిధుల ఖర్చును ఆమోదించే అధికారం, జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలోని సంబంధిత DMF పాలక మండలికి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ (DMF) ద్వారా సమకూరిన నిధులతో ప్రతి జిల్లాల్లో 70 శాతం వరకూ ఆరోగ్యం, విద్య, త్రాగునీరు సరఫరా, విద్య, నైపుణ్యాభివృద్ధి & జీవనోపాధి కల్పన మొదలైన ప్రాధాన్యతా రంగాలలోను, మిగిలిన 30 శాతం వరకు నిధులను మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ఇంధనం, వాటర్‌షెడ్ అభివృద్ధి మరియు పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచే ఇతర రంగాలలో వినియోగిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే తెలిపారు. అంతేగాకుండా, ఈ నిధుల వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసం కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (CAG) చేత డీఎంఎఫ్ ఖాతాలను ఆడిట్ చేయిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఇట్లు,
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం.
ఏలూరు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
