
జాతీయ స్థాయిలో ఎల్కలపల్లి యూపీఎస్‌కు స్వచ్ఛ పాఠశాలగా గుర్తింపు….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : పచ్చదనం, పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంలో పాలకుర్తి మండలం ఎల్కలపల్లి యూపీఎస్ పాఠశాల జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమంలో భాగంగా ఎల్కలపల్లి యూపీఎస్ పాఠశాల రాష్ట్రస్థాయిలో 4వ స్థానం, దేశస్థాయిలో 47వ స్థానం సాధించి ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది.
పాఠశాల అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక చొరవ
పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల ఎల్కలపల్లి యూపీఎస్‌ను సందర్శించి, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.10 లక్షలు మంజూరు చేశారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో పాఠశాలలో సోలార్ ప్యానల్స్, ఆకర్షణీయమైన వాల్ పెయింటింగ్స్‌తో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా నిలిచాయి.
కలెక్టర్‌కు కృతజ్ఞతలు
ఎల్కలపల్లి యూపీఎస్ పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుమాల లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, మౌలిక వసతుల కల్పనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
పాఠశాల రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించడంలో జిల్లా కలెక్టర్ అందించిన సహకారం ఎంతో ప్రోత్సాహాన్ని అందించిందని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
