
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి….
సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం….
— అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి , : సమానత్వానికి, వీరోచిత పోరాటానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, వాటి సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆదేశాల మేరకు పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల (బీసీ) అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1650 ఆగస్టు 18న సాధారణ కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న గౌడ్ అసాధారణ ధైర్యసాహసాలతో ప్రజల కోసం పోరాడారని తెలిపారు. గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని తనదైన పరిపాలనను అందించారని, ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు భవిష్యత్తులో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మండల, గ్రామ స్థాయిలో కూడా అధికారికంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె. రంగారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
