
ఐఎఫ్‌టీయూ 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి….
కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటమే మార్గం: కె. విశ్వనాథ్ పిలుపు…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : రామగుండం: ఐఎఫ్‌టీయూ 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు కె. విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఈ నెల 22, 23 తేదీల్లో గోదావరిఖని అడ్డగుంట సిరి ఫంక్షన్ హాల్‌లో జరగనున్న రాష్ట్ర మహాసభలకు సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా 19-8-2026న జిఎల్‌బికెయు (ఐఎఫ్‌టీయూ) రామగుండం డివిజన్ కార్యదర్శి దాముక లచ్చన్న ఆధ్వర్యంలో జిడికె-1 ఇంక్లైన్‌లో మహాసభల కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరెల్లి కృష్ణతో పాటు నాయకులు పాల్గొన్నారు.
కె. విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గ హక్కులను హరించే విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్ల అమలుతో కార్మికులు అధిక పనిభారం, శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణి యాజమాన్యం 2025-2026 వార్షిక లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే విజిలెన్స్ పేరుతో పెండింగ్‌లో ఉన్న కుటుంబ సభ్యుల ఉద్యోగాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు జరుగుతున్న నిరాహార దీక్షకు ఐఎఫ్‌టీయూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది.
సమాన పనికి సమాన వేతనం అనే హక్కు నేడు అమలులో లేకుండా పోయిందని, ఉపాధి హామీ, ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని నాయకులు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
భవిష్యత్ పోరాటాల రూపకల్పన కోసం నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, అలాగే ఆర్థిక, హార్దిక సహకారాలు అందించాలని ఐఎఫ్‌టీయూ నాయకత్వం కార్మిక వర్గాన్ని కోరింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
