
చార్జిషీట్ నుంచి తీర్పు వరకు.. ప్రతి దశలో టైమ్‌లైన్ పాటించాలి….
టీమ్‌వర్క్‌తోనే న్యాయపరమైన విజయాలు సాధించగలం….
— సీపీ అంబర్ కిశోర్ ఝా…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీస్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభం నుంచి చార్జిషీట్ దాఖలు, కోర్టు విచారణ, సాక్షుల హాజరు, తుది తీర్పు వరకు ప్రతి దశలో నిర్ణీత కాలపరిమితిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
శనివారం సీపీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడారు. చార్జిషీట్ దాఖలుకు ముందు సీడీ ఫైల్‌తో పాటు సంబంధిత పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని, ముఖ్యమైన కేసులను ముందుగానే గుర్తించి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు సమాచారం అందించాలని సూచించారు.
సాక్షులను ట్రయల్‌కు ముందే సమగ్రంగా బ్రీఫింగ్ చేసి, ఏపీపీలు, పీపీలు, కోర్టు లైజనింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విచారణ సమయంలో సాక్షులు తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమన్లు, వారెంట్లు, సీసీడీల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసి నవీకరించాలని, తీర్పు కాపీలు అందిన వెంటనే వాటిని అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
కోర్టు రికార్డులు, పోలీస్ స్టేషన్ రికార్డుల్లోని నాన్‌బెయిలబుల్ వారెంట్ల సంఖ్య ఒకే విధంగా ఉండేలా నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. సంచలనాత్మక కేసుల ట్రయల్ షెడ్యూల్‌ను ముందుగానే ఉన్నతాధికారులకు తెలియజేయాలని, అవసరమైన చోట సాక్షులు, నిందితుల హాజరుకు ఈ-సమన్లు జారీ చేసేలా మేజిస్ట్రేట్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
కేసుల దర్యాప్తు లేదా కోర్టు విచారణలో అనవసర జాప్యం జరిగితే దాని ప్రభావం పోలీసుశాఖపైనే పడుతుందని సీపీ స్పష్టం చేశారు. ప్రతి కేసు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత టైమ్‌లైన్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. పకడ్బందీ దర్యాప్తు, బలమైన సాక్ష్యాధారాల సేకరణ, సమర్థవంతమైన న్యాయపరమైన సమన్వయంతో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు.
“న్యాయం జరిగే కోర్టు ప్రాంగణంలో అవినీతికి ఎలాంటి స్థానం ఉండకూడదు. విధుల్లో నిజాయితీ, పారదర్శకత పాటించాలి” అని సీపీ అన్నారు. గత రెండు, మూడు నెలల్లో కోర్టు కేసుల పర్యవేక్షణలో గణనీయమైన పురోగతి సాధించామని, అదే స్థాయిని కొనసాగిస్తూ మరింత క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.
న్యాయపరమైన విజయాలు ఏ ఒక్క అధికారి కృషి వల్ల సాధ్యం కావని, దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. “మంచి పని చేయండి.. టైమ్‌లైన్‌ను పాటించండి.. బాధ్యతలను ముందుగానే అంచనా వేసుకుని పనిచేయండి. టీమ్‌వర్క్‌తోనే న్యాయపరమైన విజయాలు సాధించగలం” అని సీపీ స్పష్టం చేశారు.
సిబ్బందికి వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. సమర్థవంతంగా పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు.
పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించిన కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులను సీపీ శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, వర్టికల్ ఇన్‌చార్జి తాండూర్ సీఐ దేవయ్య, లైజనింగ్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ కిరణ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు అనిల్ కుమార్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐ వినీత, ఐటీ కోర్ ఎస్‌ఐ సంతోష్, సీసీ సందీప్, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
