శాంతి, సౌభ్రాతృత్వంతో మీలాద్‌-ఉన్‌-నబీ నిర్వహించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా….

Spread the love

శాంతి, సౌభ్రాతృత్వంతో మీలాద్‌-ఉన్‌-నబీ నిర్వహించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా….

మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం.. పుకార్లను నమ్మొద్దని సూచన….

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ : మీలాద్‌-ఉన్‌-నబీ పండుగను శాంతియుత వాతావరణంలో, సోదరభావంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.

పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ముస్లిం మత పెద్దలతో సీపీ అధ్యక్షతన పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జూలూసులు, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తీసుకుని, నిర్ణయించిన మార్గాల్లోనే నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు, సౌండ్ సిస్టమ్‌లు వినియోగించవద్దని, చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు, ఆసుపత్రుల్లోని రోగులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రసంగాలు, పాటలు, నినాదాలకు దూరంగా ఉండాలని, ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని కోరారు. యువత శాంతి, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఎలాంటి గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, పుకార్లను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఏదైనా సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోకుండా షేర్ చేయవద్దని, సందేహాలుంటే స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మత ఘర్షణలకు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పండుగ సందర్భంగా అవసరమైన భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌-112, కమిషనరేట్ కంట్రోల్ రూమ్ 8712656597 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవంతో మీలాద్‌-ఉన్‌-నబీ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా కోరారు.

సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, రామగుండం సీఐ కృష్ణ కుమార్, బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ భీమేష్, ఆర్‌ఐ రమేష్, పెద్దపల్లి ఎస్‌ఐ నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ చంద్రశేఖర్, చెన్నూర్ టౌన్ ఎస్‌ఐ శ్యామ్ పటేల్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top