
మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచశాంతికి మార్గదర్శకం….
జిల్లా వ్యాప్తంగా ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ :
ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్‌లో గత రెండు రోజులుగా మర్కజ్ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జామా మసీదు నుంచి జెండా చౌరస్తా, కమాన్, అయ్యప్ప టెంపుల్, బస్టాండ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జామా మసీదు మౌలానా మహమ్మద్ అజీముద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచశాంతికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రవక్త చూపిన సన్మార్గంలో నడవాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మర్కజ్ మిలాద్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
