గణపతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Spread the love

గణపతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి….

విద్యుత్‌, పారిశుద్ధ్యం, రహదారులు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి…..

— ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : రామగుండం నియోజకవర్గంలో త్వరలో జరగనున్న గణపతి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గణపతి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

నగర పాలక సంస్థ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ జల్ద అరుణశ్రీ, మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి దీపాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, తాగునీరు తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

వినాయక మండపాల ఏర్పాటు సమయంలో విద్యుత్‌ స్తంభాలకు తగిన దూరం పాటించాలని, విద్యుత్‌ సరఫరా కారణంగా ప్రమాదాలు జరగకుండా ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా ఎంసీబీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌ భద్రత విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

గణపతి ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ సూచించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

నగరంలో రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నిమజ్జన మార్గాల్లో అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌, నగర పాలక సంస్థ అధికారులు, తహసీల్దార్‌, ఎన్‌పీడీసీఎల్‌, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ, సింగరేణి అధికారులు, పోలీసు అధికారులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top