
పెద్దంపేట్‌లో బెల్ట్‌షాపులపై పి.వై.ఎల్ సమరశంఖం…
వాడవాడలా మద్యం విక్రయాలు.. పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి….
బెల్ట్‌షాపులు తక్షణమే నిషేధించాలి.. లేదంటే మహిళలు, ప్రజలతో కలిసి ధర్నాలు…
–పి.వై.ఎల్….
పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి,అంతర్గాం//
అంతర్గాం మండలం పెద్దంపేట్ గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను తక్షణమే నిషేధించాలని ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) డిమాండ్ చేసింది. గ్రామంలో వాడవాడలా మద్యం దుకాణాలు వెలసిపోవడంతో పేద ప్రజలు అనారోగ్యాల బారిన పడటంతో పాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
పి.వై.ఎల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండి అశోక్ అధ్యక్షతన పెద్దంపేట్ గ్రామంలోని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఈదునూరి బాబు, పి. క్రాంతికుమార్, వార్డు సభ్యుడు ఆరుమూల్ల సృజన్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్‌షాపుల సంఖ్య పెరిగిపోవడం వల్ల అనేక కుటుంబాలు మద్యం బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
బెల్ట్‌షాపులను తక్షణమే నిషేధించాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఆబ్కారీ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా కొనసాగుతున్న మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించకపోతే మహిళలు, ప్రజలను సమీకరించి గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఆబ్కారీ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడతామని పి.వై.ఎల్ నాయకులు హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎ. తిరుపతి, పి. రమేష్, తూల్ల సతీష్, ఈదునూరి అంజి, బి. సతీష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
