హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి
** తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు
తిరుపతి: అభంశుభం తెలియని చిన్నారులపై హత్యాచారాలు చేసే వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. వైఎస్సార్ కడప జిల్లా కంబాలదిన్నెలో మూడేళ్ళ చిన్నారిపై హత్యాచారం సొంత బంధువే చేయడం ప్రజలందరితో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఎంతో కలిచి వేసిందని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. 2018లో జమ్మూ-కాశ్మీర్ లోని కతువాలో ఎనిదేళ్ళ చిన్నారి అసిపా భానును అత్యంతదారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై పవన్ కళ్యాణ్ పోరాడి నిరసన వ్యక్తం చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అయినా దేశంలో, రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటానికి శిక్షల పట్ల భయం లేకుండా పోతుండటమే కారణమనే భావన వ్యక్తమౌతోందని ఆయన చెప్పారు.
పోక్స్ చట్టం అమలులో ఉన్నా మైనర్లపై అత్యాచారాలు జరగుతుండటం బాధాకరమని ఆయన తెలిపారు. అందుకే రాష్ట్రంలో ఎవరైనా సరే హత్యాచారానికి పాల్పడాలంటే వణుకు పుట్టేలా కఠిన శిక్ష పడేలా పోలీసులు, న్యాయశాఖ పని చేయాలని ఆయన కోరారు. తల్లితండ్రులతో పాటు స్కూల్స్ లోనూ చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎదో నేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కౌమార దశ నాటికే యువకులకు నైతిక విలువలు నేర్పిస్తే మంచిదని ఆయన చెప్పారు. అశ్లీల వెబ్ సైట్స్ ను పూర్తిగా నిషేధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు రాజా రెడ్డి, ఆర్కాట్ కృష్ణప్రసాద్, అనీల్ రాయల్, బాలిశెట్టి కిషోర్, పగడాల మురళీ, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
