టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డివి అభూత కల్పనలే
** పత్రికా ప్రకటన ద్వారా టీటీడీ వివరణ
తిరుపతి: శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవం అని టీటీడీ ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని పేర్కొన్నారు.
శ్రీవారి ఆలయంలో గానీ, వెలుపల గానీ, ఉభయ కాలిబాట మార్గాల్లో, కళ్యాణ కట్ట, శ్రీవారి సేవ, బయట క్యూలైన్లు, వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం తదితర ప్రాంతాల్లో కూడా ఒక సంవత్సర కాలంగా ఓం నమో వేంకటేశాయ నామాన్ని అన్ని చోట్లా ప్రతిధ్వన్వించేలా ఏర్పాటు చేశాం అని ఆ ప్రకటనలో తెలిపారు. వేద పాఠశాలల్లో వేద విద్యార్థులకు శారీరక – మానసిక దృఢత్వం పెంచే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. అర్చకులను తనిఖీ చేయడమన్నది పూర్తిగా వాస్తవ దూరం. అర్చకులకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. వారికి ఇచ్చే గౌరవం వారికి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆలయం లోపల ఇటీవల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది.
ఆలయం లోపల కూడా భక్తుల నుండి దర్శనాలు, తీర్థ ప్రసాదాలు, తదితర అంశాలపై అభిప్రాయ సేకరణ విధానాన్ని ప్రారంభించి పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఈ విధానంపై భక్తుల నుండి ప్రశంసలు అందుతున్నాయి. గతంలో టీటీడీ కేటాయించిన స్థలానికన్నా ఎక్కువ స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టినందుకు కోర్టు ఆదేశాలు ప్రకారం విశాఖ శారదా పీఠం, మరో ఒకటి రెండు మఠాలపై నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలి.
గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నాం. బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నాం. టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నాం. వాటిలో ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. 2023 సంవత్సరం పరకామణిలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఏర్పడిన అపవాదును తొలగించడానికి ఒక సంవత్సర కాలంగా ఒక పకడ్బందీ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగింది. ఎవరైనా పరకామణిలో ప్రవేశించాలంటే ఈ ఎస్.ఓ.పీ లో పేర్కొన్న విధంగా భద్రతా తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇంతటి పకడ్బందీ వ్యవస్థ వల్ల గత సంవత్సర కాలంగా పరకామణిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
వాస్తవాలు ఈ విధంగా వుండగా సదరు మాజీ చైర్మన్ ఆధ్యాత్మిక సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని తెలియజేస్తున్నాం . వ్యవస్థపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాం.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
