
సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ – పెద్దబొంకూర్‌లో పోలీసుల అవగాహన సదస్సు….
వాహనాల తనిఖీల్లో 40 వాహనాల స్వాధీనం.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు సూచన….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ గ్రామంలో సోమవారం పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరై గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల బాధ్యతలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను పంచుకోవద్దని సూచించారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం వాహనాల తనిఖీలు నిర్వహించగా, సరైన పత్రాలు లేని 6 ఆటోలు, 34 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రం తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, సర్కిల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
