సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం

Spread the love

సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర కీలకం
ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా విరాట్ విశ్వకర్మ ఉత్సవం…

జిల్లా కలెక్టర్‌తో కలిసి విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు….

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవంలో ఆయన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విరాట్ విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి విశ్వకర్మలు తమ నైపుణ్యం, శ్రమ, సృజనాత్మకతతో సమాజ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని అన్నారు.

కళలు, వృత్తులు, నిర్మాణ రంగాల అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ కులసోదరులు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. విరాట్ విశ్వకర్మను దైవస్వరూపంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ప్రాచీన కాలం నుంచే విశ్వకర్మలు తమ అద్భుతమైన నైపుణ్యంతో కళలు, వృత్తులు, నిర్మాణ రంగాలకు విశిష్ట సేవలు అందించారని కలెక్టర్ పేర్కొన్నారు. వారి నైపుణ్యం, కృషి, సేవలను భావితరాలకు తెలియజేయడంలో ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

విశ్వకర్మ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వకర్మల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top