ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Spread the love

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, : ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జాతీయ గీతం, వందేమాతరం ఆలాపనతో ప్రారంభమైన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుతో పాటు సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ బలోపేతం, యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, విద్యా–వైద్య రంగాల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో 2,46,981 బీపీఎల్ కుటుంబాల్లోని 7.18 లక్షల మందికి ప్రతి నెల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ 1.19 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు.

గృహజ్యోతి పథకం ద్వారా 1,40,116 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ రూ.141.64 కోట్ల సబ్సిడీ అందించామని వివరించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు 7,199 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 5,982 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.135 కోట్ల ఆర్థిక సహాయం జమ చేసినట్లు వెల్లడించారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఆయిల్‌పామ్ సాగు విస్తరణతో పాటు సూక్ష్మ నీటి సేద్య పథకాల ద్వారా రైతులకు రాయితీలు అందిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందిస్తున్నట్లు తెలిపారు. మంథనిలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 48,188 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి రూ.120.56 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మహిళల ఆరోగ్య పరీక్షలు, అసంక్రామిక వ్యాధుల నిర్ధారణ, అత్యవసర వైద్య రవాణా సేవలను విస్తృతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.

మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, మహిళా శక్తి భవనం, బస్ డిపో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన నాలుగు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.82 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు.

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకు పైగా పెట్టుబడులతో జిల్లాలో పరిశ్రమ స్థాపనకు ముందుకు రావడం పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఆర్డీఓ బి. గంగయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top