సినీ నటుడు మురళీధర్ గౌడ్ ఇంట విషాదం
మురళీధర్ భార్య ఐరేని శశికళ(58) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ గురువారం మరణించారు.
ఈ ఘటనతో మురళీధర్ గౌడ్ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో రామాయంపేట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించారు. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మురళీధర్ గౌడ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి రిటైర్ అయిన తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 2018లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో ఆయన సినిమా ప్రయాణం ప్రారంభమైంది.
తర్వాత 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత ‘బలగం’ సినిమా ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. ‘మేము ఫేమస్’, ‘మ్యాడ్’, ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలతో కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
