
రేషన్ షాపులవద్ద ప్రజలు అవస్థలు
సనీస సదుపాయాలు లేక ఎండలోనే పడిగాపులు
మూడు నెల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో తప్పని బయోమెట్రిక్ కష్టాలు
సూర్యాపేట జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రత మధ్య గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి రావడం ప్రజల్లో ఆవేదనను రేకెత్తిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చిన్నపిల్లలు ఉన్న తల్లులు , వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులవద్ద త్రాగునీరు, షెడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది.
మూడు నెలల రేషన్ ఒకేసారి
ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయడం వల్ల ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీంతో డీలర్ షాపుల వద్ద పంపిణీ చాలా నెమ్మదిగా జరుగుతోంది. ఒక రోజులో అందరికీ సరఫరా చేయడం కష్టమవడంతో ప్రజలు పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
బయోమెట్రిక్ సమస్యలతో ఆలస్యం
రేషన్ తీసుకోవడానికి బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేయడం వల్ల మరో సమస్య తలెత్తుతోంది. ఒక్కొక్కరికి మూడు సార్లు వరకు వేలిముద్రలు వేయించాల్సి వస్తోంది. యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, నెట్‌వర్క్ సమస్యల కారణంగా గంటల సమయం వృథా అవుతోంది.
డీలర్ షాపుల నిర్లక్ష్యం – ప్రజల్లో అసహనం
కొన్ని ప్రాంతాల్లో డీలర్లు సమయానికి దుకాణాలు తెరవకపోవడం, సరైన విధంగా పంపిణీ చేయకపోవడం వంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం ప్రజల ఇబ్బందులను మరింత పెంచుతోంది. తీవ్ర ఎండల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీని దశలవారీగా చేయాలని, షాపుల వద్ద నీడ, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బయోమెట్రిక్ ప్రక్రియను సులభతరం చేసి, డీలర్ల పనితీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన రేషన్ పంపిణీ విధానం ప్రస్తుతం ఇబ్బందులకు కారణమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజల ఆవేదన మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది అనేది స్పష్టమవుతుంది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
