
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : అదనపు కలెక్టర్ సీతారామరావు
సూర్యాపేట జిల్లా : రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కె. సీతారామరావు అధికారులను ఆదేశించారు. గురువారం చివ్వేం మండలంలోని రాంకోటి తండా, సూర్యాపేట మండలంలోని రాయినిగూడెంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల పనితీరును తనిఖీ చేసి, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి కాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు.
ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండటంతో ధాన్యంలో తేమ శాతం, తాలు, తరుగు వంటి సమస్యలు లేవని, అందువల్ల ఆలస్యం లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని అన్నారు. హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఓపిఎంఎస్‌లో నమోదు చేసి వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. అలాగే తేమ శాతం కొలిచే పరికరాలు, బరువు యంత్రాలు సక్రమంగా పనిచేసేలా నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చివ్వేం తహసీల్దార్ చంద్రశేఖర్, సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
