
విద్య పేరుతో దోపిడీ ఆపాలి…
అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాంల విక్రయిస్తే దాడులు తప్పవు
ఏఐఎస్ఎఫ్…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను విక్రయిస్తూ, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ, “నో ప్రాఫిట్ – నో లాస్” విధానంలో విక్రయించాల్సిన పాఠ్యపుస్తకాలను డిస్ట్రిబ్యూటర్లతో శాతం ఒప్పందాలు చేసుకుని భారీ లాభాలకు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని ఆరోపించారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థలే విద్యను వ్యాపారంగా మార్చి, యూనిఫాంలను కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక బుక్ స్టాల్స్ ఏర్పాటు చేసి, అక్కడే పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతపెట్టడం అన్యాయమని పేర్కొన్నారు.
జీఎస్టీ అనుమతులు ఉన్నాయనే పేరుతో ఇష్టానుసారంగా ధరలు వసూలు చేయడం సరికాదని, విద్యను వ్యాపారంగా మార్చడం ద్వారా విద్యార్థులకు తప్పు సందేశం వెళ్తోందని అన్నారు. అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్న పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకొని, అవసరమైతే ఆయా పాఠశాలల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే స్పందించని విద్యాశాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆర్నకొండ సాయి ఆజాద్, తడిగొప్పుల అనుప్ సాయి, ఆరే జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
