
మూడు దశాబ్దాల ప్రజాసేవకు ఘన సన్మానం…
ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఘనంగా వీడ్కోలు…
— అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్..
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు అధికారులకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్‌ఐలు ఠాకూర్ సహదేవ్ సింగ్, మహమ్మద్ అహ్మదుల్లా, మేకల మహేందర్ రెడ్డి, ఏఎస్‌ఐలు బోయ శ్రీనివాస్, మహమ్మద్ అమానుల్లా, ఏఆర్ ఎస్‌ఐ పి. వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ బొట్ల చేరాలులను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ పూలమాలలు వేసి, శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజల భద్రత కోసం వ్యక్తిగత సుఖాలు, కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తూ నిర్వర్తించే అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని అన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం వారు అందించిన సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో సంపాదించిన గౌరవం, ప్రజల విశ్వాసం, మంచి పేరు జీవితంలో అత్యంత విలువైన సంపద అని కొనియాడిన ఆయన, ఉద్యోగ విరమణ అనేది సేవా జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తమ అనుభవాన్ని సమాజానికి మార్గదర్శకంగా అందించాలని ఆకాంక్షించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారు చేసిన సేవలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ రమేష్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ గోపి, ఆర్‌ఐలు దామోదర్, శేఖర్, పెద్దన్న, రమేష్, సీపీఓ సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సందీప్, సంధ్య, సీసీ హరీష్, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, సరిత, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు పోచలింగం తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
