ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం…

Spread the love

ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం…

ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి….

–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం బాధ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతి, బూత్ స్థాయి బాధ్యులు చేపట్టాల్సిన చర్యలు, ప్రజలకు అందించాల్సిన సహకారంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి బాధ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తుల నింపడంలో సహకరించాలని కోరారు.

ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, వివరాల్లో తప్పులు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తు సక్రమంగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. సేవాభావంతో పనిచేస్తే ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, ఉప మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, గ్రామాల ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం బాధ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top