
రెండేళ్లుగా కనిపించని తల్లి–కుమారుడిని గుర్తించిన రామగుండం పోలీసులు…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: గోదావరిఖని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి రెండేళ్లుగా కనిపించకుండా ఉన్న తల్లి, కుమారుడిని గుర్తించిన రామగుండం పోలీసులు వారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన చెట్టి రమేష్ ఫిర్యాదు మేరకు, ఆయన భార్య చెట్టి సంధ్య, 12 ఏళ్ల కుమారుడు 2024 మార్చి 8న ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపించకపోవడంతో రామగుండం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కేసు నమోదు అనంతరం హెడ్ కానిస్టేబుల్ బానయ్య, పోలీస్ కానిస్టేబుల్ అశోక్ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను విచారించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ కాల్ వివరాలు, ఇతర ఆధారాలను విశ్లేషించారు. ఈ క్రమంలో తల్లి, కుమారుడు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి, అక్కడి నుంచి వారిని సురక్షితంగా తీసుకువచ్చారు.
గోదావరిఖనిలో సహాయ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్, రామగుండం సీఐ కృష్ణ, ఎస్‌ఐ సంధ్యారాణి సమక్షంలో తల్లి, కుమారుడిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ సందర్భంగా మిస్సింగ్ కేసును చాకచక్యంగా ఛేదించి తల్లి, కుమారుడి ఆచూకీ కనుగొన్న హెడ్ కానిస్టేబుల్ బానయ్య, పోలీస్ కానిస్టేబుల్ అశోక్‌లను సహాయ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ అభినందించారు. విధి నిర్వహణలో వారు చూపిన చొరవ, నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
