
ఉద్యోగార్థులుగా కాదు… ఉద్యోగాలు కల్పించే వారిగా యువత ఎదగాలి…
— ఎంపీ గడ్డం వంశీకృష్ణ…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:హైదరాబాద్, హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో బవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన “బవర్ యూజీ సమ్మిట్–2.0” కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.
“నేడు నాకు 18 సంవత్సరాల వయస్సు ఉంటే?” అనే భావనతో నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న ఎంపీ, “భారత యువత భవిష్యత్తు – నిర్మాణం, నాయకత్వం, పారిశ్రామిక అవకాశాలు” అనే అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగడం ద్వారా ప్రపంచ వేదికపై భారత యువత తమ ప్రతిభను చాటగలరని అన్నారు.
యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువత చేతుల్లోనే ఉందని, ప్రతి విద్యార్థి తన కలలను లక్ష్యాలుగా మలుచుకుని వాటి సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు, అధ్యాపకులు, ప్రారంభ సంస్థల ప్రతినిధులు, విద్యారంగ నిపుణులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం నిర్వాహకులు ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
