మహిళా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం….

Spread the love

మహిళా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం….

యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత…

— ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు..

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: సుల్తానాబాద్, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి నివాస ప్రాంతాల్లోనే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 7వ. వార్డులో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన బస్తీ దవాఖానకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలను బలోపేతం చేస్తోందన్నారు. బస్తీ దవాఖానకు అవసరమైన బోర్‌వెల్, ప్రహరీ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల కోసం మరో రూ.5 లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సుల్తానాబాద్, సుగ్లంపల్లి, పూసాల ప్రాంతాల్లో మహిళా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, సుల్తానాబాద్ పట్టణ మహిళల కోసం 10 గుంటల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి అవసరమైన నిధులు అందిస్తామని తెలిపారు.

యూరియా కొరతపై స్పందిస్తూ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు వరికి బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో భూగర్భ జలాల మట్టం తగ్గే అవకాశం ఉన్నందున నీటి వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, యూరియాకు బదులుగా సేంద్రియ ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, స్థానిక కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్, మున్సిపల్ కౌన్సిలర్లు, వైద్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top