
విద్యార్థుల భద్రతలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర.. ధర్మారంలో షీ టీమ్ అవగాహన సదస్సు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ధర్మారం, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో ధర్మారం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.
షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పోక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందో వివరిస్తూ, విద్యార్థులను సురక్షితమైన డిజిటల్ వినియోగం వైపు నడిపించాలని కోరారు.
మహిళల భద్రతకు షీ టీమ్ నిరంతరం కృషి చేస్తోందని, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, కళాశాలలు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో ప్రతిరోజూ ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అలాగే సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఎదురైనా లేదా బెదిరింపులకు గురైనా వెంటనే 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి పోలీసుల సహాయం పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షీలా, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
