భారీ వర్షాలపై రామగుండం పోలీసుల హై అలర్ట్

Spread the love

భారీ వర్షాలపై రామగుండం పోలీసుల హై అలర్ట్
రాళ్లవాగు ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా….

ప్రమాద ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన…

పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:మంచిర్యాల, : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. మంచిర్యాల జోన్ పరిధిలోని పాత మంచిర్యాల ప్రాంతంలో రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. పోలీసులు సూచించిన ట్రాఫిక్ మళ్లింపులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, వర్షాకాలంలో భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

వాతావరణ శాఖ మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైతే ఎస్‌డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పొందిన సుమారు 30 మంది సిబ్బంది అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత ఏడాది వరదల సమయంలో గ్రామాలు నీటిలో చిక్కుకున్నప్పుడు బోట్ల సహాయంతో విజయవంతంగా సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేందుకు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ అందుబాటులో ఉన్నారని కమిషనర్ తెలిపారు.

ఈ పరిశీలనలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top